

నేటి భారత్ న్యూస్- అమెరికా ఎన్నికల వ్యవస్థలో సమూల మార్పులకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నడుంబిగించారు. ఇందులో భాగంగా అమెరికాలో ఎన్నికలు నిర్వహించే విధానంలో గణనీయమైన మార్పులను కోరుతూ తీసుకొచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై ట్రంప్ సంతకం చేశారు. ఓటర్లు తమ అమెరికన్ పౌరసత్వాన్ని నిరూపించుకోవాలని తాజా ఆర్డర్ ఆదేశిస్తుంది. అలాగే, ఎన్నికల రోజు నాటికి అందిన మెయిల్-ఇన్, లేదా, గైర్హాజరీ బ్యాలెట్లను మాత్రమే లెక్కించాలని ఇది చెబుతోంది. అమెరికన్ పౌరులు కాని వారు విరాళం ఇవ్వకుండా ఇది అడ్డుకుంటుంది. భారతదేశం, బ్రెజిల్ వంటి దేశాల్లో ఎన్నికల నిర్వహణ తీరును ప్రస్తావిస్తూ.. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాలు రెండింటిలోనూ ఇప్పటికే ప్రామాణికమైన ‘ప్రాథమిక, అవసరమైన ఎన్నికల రక్షణలను’ అమలు చేయడంలో అమెరికా విఫలమవుతోందని ట్రంప్ పేర్కొన్నారు. భారత్, బ్రెజిల్ దేశాలు ఓటరు గుర్తింపును బయోమెట్రిక్ డేటాబేస్కు అనుసంధానిస్తున్నాయి. అయితే, అమెరికా మాత్రం ఇప్పటికీ పౌరసత్వం కోసం స్వీయ ధ్రువీకరణపై ఆధారపడుతోందని ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్యాలెట్ ప్రాసెసింగ్ విషయంలో అమెరికా అనుసరిస్తున్న అస్థిర విధానాన్ని ట్రంప్ విమర్శించారు. మోసం, లోపాలు, లేదా అనుమానాలు లేని స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, నిజాయతీ గల ఎన్నికలు మన రాజ్యాంగ గణతంత్రాన్ని కాపాడుకోవడానికి ప్రాథమికమైనవని ట్రంప్ నొక్కి వక్కాణించారు.