

నేటి భారత్ న్యూస్- ఆంధప్రదేశ్‌లో రూ. 5 వేల కోట్ల పెట్టుబడితో బల్క్ డ్రగ్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని లారస్ ల్యాబ్స్ లిమిటెడ్ నిర్ణయించింది. అనకాపల్లి జిల్లా గోరపూడి గ్రామంలోని ఐపీ రాంబిల్లి ఫేజ్-2లో నెలకొల్పనున్న ఈ యూనిట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉపాధి లభించనుంది. కాగా, 2007 నుంచి విశాఖ పరిసర ప్రాంతాల్లో లారస్ సంస్థ రూ. 6,500 కోట్ల పెట్టుబడితో పలు యూనిట్లు నెలకొల్పింది. వాటి ద్వారా దాదాపు 10 వేల మందికి ఉపాధి లభిస్తోంది. లారస్ సంస్థ సీఈవో చావా సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నరసింహారావు నిన్న రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిని కలిశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఈ యూనిట్ ద్వారా ఫర్మెంటేషన్, క్రాప్ సైన్స్ కెమికల్స్, గ్రీన్ కెమిస్ట్రీ వంటి ప్రత్యేక రసాయనాలను తయారు చేస్తుందని తెలిపారు. లారస్ సంస్థకు భూ కేటాయింపులతోపాటు అన్ని విధాలా ప్రభుత్వం సహకరిస్తుందని, వీలైనంత త్వరగా నిర్మాణ పనులు చేపట్టాలని సీఎం కోరారు.