

నేటి భారత్ న్యూస్- పాకిస్థాన్, యూఏఈ ఆతిథ్యమిస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో వరుసగా సెంచరీలు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క పాకిస్థాన్ జట్టు మినహాయిస్తే మిగతా ఏడు జట్ల తరఫున పలువురు ఆటగాళ్లు శతకాలు బాదారు. నిన్నటి ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మ్యాచ్‌లో రెండు సెంచరీలు వచ్చాయి. మొదట ఆఫ్ఘన్ ఆటగాడు ఇబ్రహీం జద్రాన్ భారీ శతకం (177) నమోదు చేయగా.. ఆ తర్వాత ఛేదనలో ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ కూడా సెంచరీ (120) నమోదు చేశాడు. దీంతో ఇప్పటివరకు ఈ సీజన్‌లో 11 సెంచరీలు నమోదయ్యాయి. ఇంకా నాకౌట్ దశలో కొన్ని మ్యాచ్‌లతో పాటు సెమీ ఫైనల్స్, ఫైనల్ ఉండడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఒక సీజన్‌లో అన్ని జట్లు కలిపి చేసిన అత్యధిక శతకాలు ఇవే. గతంలో 2002, 2017లో 10 సెంచరీల చొప్పున నమోదయ్యాయి. ఈ రికార్డు ఇప్పుడు బద్దలైంది. అంతకుముందు 2006లో 7, 2000, 2009లో 6, 1998, 2004లో 4, 2013లో 3 సెంచరీలు నమోదయ్యాయి. కాగా, ఈ ఎడిషన్‌లో విల్ యంగ్ (న్యూజిలాండ్), టామ్ లాథమ్ (న్యూజిలాండ్), తోహిద్ హృదయ్ (బంగ్లాదేశ్), శుభ్‌మన్ గిల్ (భారత్), ర్యాన్ రికెల్టన్ (దక్షిణాఫ్రికా), బెన్ డకెట్ (ఇంగ్లండ్), జోష్ ఇంగ్లిస్ (ఆస్ట్రేలియా), విరాట్ కోహ్లీ (భారత్), రచిన్ రవీంద్ర (న్యూజిలాండ్), ఇబ్రహీం జాద్రాన్ (ఆఫ్ఘనిస్థాన్) సెంచరీలు సాధించారు.