

నేటి భారత్ న్యూస్- యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహా కుంభమేళా మహా శివరాత్రి సందర్భంగా నిన్నటితో ముగిసింది. జనవరి 13న ప్రారంభమై 45 రోజుల పాటు సాగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో 66 కోట్లకు పైగా మంది భక్తులు పుణ్యస్నానం ఆచరించినట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. గంగా, యమునా, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద 66.21 కోట్ల మంది భక్తులు పవిత్ర స్నానంలో పాల్గొన్నారని తెలిపారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో అఖాడాలు, సాధువులు, మహామండలేశ్వర్ల ఆశీర్వాదంతో ఈ మహత్తర కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. చరిత్రలో నిలిచిపోయే ఈ మహా కుంభమేళాలో భాగమైన భక్తులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఇక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా ఉత్తరప్రదేశ్ సర్కార్‌కు రూ. 3 లక్షల కోట్లకు పైగా ఆదాయం సమకూరినట్లు తెలుస్తోంది. తద్వారా ఇది దేశంలో అతిపెద్ద ఆర్థిక కార్యక్రమాలలో ఒకటిగా నిలిచింది. కాగా, మహా కుంభమేళా ప్రారంభానికి ముందు సుమారు 40 కోట్ల మంది భక్తులు వస్తారని, దాదాపు రూ. 2 లక్షల కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతాయని ప్రాథమిక అంచనాలు ఉన్నాయని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఏఐటీ) సెక్రటరీ జనరల్, బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ అన్నారు. అయితే, దేశ విదేశాల నుంచి అపూర్వమైన స్పందన కారణంగా ఏకంగా 66.21 కోట్ల భక్తులు పాల్గొన్నారు. దీంతో రూ. 3 లక్షల కోట్లకు పైగా భారీ బిజినెస్ జరిగింది. ఆతిథ్యం, వసతి, ఆహారం, పానీయాల రంగం, రవాణా మరియు లాజిస్టిక్స్, మతపరమైన దుస్తులు, పూజ, హస్తకళలు, వస్త్రాలు ఇతర వినియోగ వస్తువులు వంటి అనేక వ్యాపార రంగాలు పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలను నిర్వహించాయి. మహా కుంభమేళా జరిగిన ప్రయాగ్‌రాజ్ మాత్రమే కాకుండా దాని పరిధిలోని 100 నుంచి 150 కి.మీ దూరంలో ఉన్న నగరాలు, పట్టణాలకు కూడా భారీ వ్యాపారం జరిగింది. ఇక ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నేపథ్యంలో ప్రయాగ్‌రాజ్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం రూ.7,500 కోట్లకు పైగా ఖర్చు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం… 14 కొత్త ఫ్లైఓవర్లు, ఆరు అండర్‌పాస్‌లు, 200కి రోడ్ల విస్తరణ, కొత్త కారిడార్లు, రైల్వే స్టేషన్ల విస్తరణ, ఆధునిక విమానాశ్రయ టెర్మినల్ నిర్మాణానికి ఈ రూ.7,500 కోట్లు ఖర్చు చేశారు. అదనంగా కుంభమేళా ఏర్పాట్ల కోసం ప్రత్యేకంగా మరో రూ.1,500 కోట్లు కేటాయించారు.