

నేటి భారత్ న్యూస్- బీఆర్ఎస్ నాయకులతో తన కుటుంబానికి ప్రాణహాని ఉందని ఇటీవల హత్యకు గురైన భూపాలపల్లికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి భార్య సరళ ఆరోపించారు. తన భర్త హత్య జరిగినప్పటి నుంచీ తాము భయంతో బతుకుతున్నామని, బయటకు వెళితే ఎవరైనా చంపేస్తారేమోనని తాను, పిల్లలం ఆందోళన చెందుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త హత్య కేసును సీబీసీఐడీకి అప్పగించాలని ఆమె డిమాండ్ చేశారు. తమకు రక్షణ కల్పించడంతోపాటు, తమ కుటుంబానికి న్యాయం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆమె వేడుకున్నారు.తన భర్త ఇంటికి వచ్చే దారిలో కరెంట్ కట్ చేసి నడిరోడ్డుపై ఆయనను దారుణంగా హతమార్చారని సరళ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే, కేసును తప్పుదోవ పట్టించేలా ఫిర్యాదును మార్చారని ఆరోపించారు. తన భర్త హత్యకు భూవివాదం కారణం కాదని, మేడిగడ్డ నిర్మాణంలో అవినీతిపై తన భర్త కేసు వేయడం వల్లే చంపేశారని అన్నారు. తన భర్త హత్యలో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌తో పాటు స్థానిక మాజీ ఎమ్మెల్యే గడ్ర వెంకటరమణారెడ్డి, మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు హస్తం ఉందని సరళ ఆరోపించారు.