

నేటి భారత్ న్యూస్- రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో తప్పు చేయాలంటేనే భయపడేలా కూటమి ప్రభుత్వ చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఈరోజు అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో భాగంగా ఆంధ్రా విశ్వవిద్యాలయంలో అక్రమాలపై చర్చ జరిగింది. వైసీపీ హయాంలో అనేక అక్రమాలు జరిగాయని టీడీపీ ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాస్, గణబాబు, వెలగపూడి రామకృష్ణబాబు, జనసేన ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ సభ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై మంత్రి లోకేశ్ మాట్లాడుతూ. ఆంధ్రా యూనివర్సిటీలో అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిస్తామని అన్నారు. ఇన్ఛార్జ్ వీసీ ఇప్పటికే విచారణకు ఆదేశించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆ విచారణ నివేదిక అందిన వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు. ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ.. గతంలో ఏయూ వీసీగా పనిచేసిన ప్రసాదరెడ్డి వైసీపీ అధ్యక్షుడి తరహాలో వ్యవహరించారని మండిపడ్డారు. ఎంతో పేరున్న ఆంధ్రా విశ్వవిద్యాలయాన్ని రాజకీయ వేదికగా ఆయన మార్చేశారని ఆరోపించారు. ఏపీలోని ఇతర వర్సిటీల ప్రక్షాళన కూడా జరగాలని ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ కోరారు. ఏయూ విషయంలో నిర్దిష్ట కాలంలో విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు పేర్కొన్నారు.