
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గజ్వేల్ అభివృద్ధిపై విమర్శలు చేశారని, ఇప్పుడు కూడా అదే ధోరణి కొనసాగిస్తున్నారని బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. కేసీఆర్ శాసనసభకు హాజరుకాకపోవడం వల్ల నియోజకవర్గ సమస్యలు పరిష్కారం కావడం లేదని గజ్వేల్ నాయకులు తనను కలిశారని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హరీశ్ రావు స్పందించారు. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలకు, దివాలాకోరు రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆయన విమర్శించారు. కేసీఆర్‌కు, గజ్వేల్‌కు మధ్య తల్లీపిల్లల అనుబంధం ఉందని ఆయన అన్నారు. గజ్వేల్‌ను ఇతర పట్టణాలకు ఆదర్శంగా కేసీఆర్ తీర్చిదిద్దారని తెలిపారు. ఒకప్పుడు గజ్వేల్ అంటే కక్షలు, దాడులకు నిలయంగా ఉండేదని, కేసీఆర్ వచ్చాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని అన్నారు. ప్రధాన మంత్రిని కూడా గజ్వేల్‌కు తీసుకొచ్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. గజ్వేల్‌లోని ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందించారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అవి రావడం లేదని ఆయన ఆరోపించారు. కేసీఆర్ కృషితో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ జలాలతో ధాన్యలక్ష్మి తాండవం చేసిందని అన్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి పాలనలో ధనలక్ష్మి మాయమైపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. భూముల ధరలు పడిపోతున్నాయని విమర్శించారు. కేసీఆర్ హయాంలో గజ్వేల్‌లోని పాఠశాలలను అద్భుతంగా తీర్చిదిద్దారని ఆయన అన్నారు. గజ్వేల్‌లో ఆయన చేసిన అభివృద్ధి ఎక్కడైనా కనిపిస్తుందని అన్నారు. ఈ నియోజకవర్గానికి కలగా మిగిలిన రైలును కూడా తీసుకువచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో గజ్వేల్ నియోజకవర్గానికి ఒక్క రూపాయి పని అయినా జరిగిందా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ ప్రజలు అల్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు.