

నేటి భారత్ న్యూస్- కొంతకాలంగా భారత్ వృద్ధిరేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2014లో ప్రపంచంలో పదో ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ ఇప్పుడు ఐదో స్థానానికి చేరుకుందని చెప్పారు. యావత్ ప్రపంచం ఇప్పుడు భారత్ వైపే చూస్తోందని అన్నారు. మద్రాస్ ఐఐటీలో నిర్వహించిన ‘ఆల్ ఇండియా రీసెర్చ్ స్కాలర్స్ సమ్మిట్ 2025’ కార్యక్రమానికి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. మద్రాస్ ఐఐటీ ఎన్నో విషయాలలో నెంబర్ వన్ గా ఉందని చంద్రబాబు కితాబునిచ్చారు. ఎన్నో రకాల ఆన్ లైన్ కోర్సులు కూడా అందిస్తోందని చెప్పారు. ఐఐటీ మద్రాస్ స్టార్టప్ లలో 80 శాతం సక్సెస్ అవుతున్నాయని తెలిపారు. స్టార్టప్ అగ్నికుల్ మంచి విజయాన్ని అందుకుందని చెప్పారు. మద్రాస్ ఐఐటీలో 35 నుంచి 40 శాతం మంది తెలుగు విద్యార్థులే ఉన్నారని అన్నారు. ఐఐటీలను స్థాపించడం దేశ విద్యారంగంలో గొప్ప ముందడుగు అని చెప్పారు. 1991లో తీసుకొచ్చిన సంస్కరణలతో భారత్ అభివృద్ధి బాట పట్టిందని చంద్రబాబు అన్నారు. అదే సమయంలో చైనా ఆర్థిక సంస్కరణలు చేపట్టిందని… ఆ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. బ్రిటీష్ వాళ్లు ఒక్క ఇంగ్లీష్ ను మాత్రమే మనకు వదిలేసి… మన దేశం నుంచి అంతా తీసుకుపోయారని అన్నారు. 1990లలో కమ్యూనికేషన్ రంగంలో బీఎస్ఎన్ఎల్, వీఎస్ఎన్ఎల్ మాత్రమే ఉండేవని… ఆర్థిక సంస్కరణల తర్వాత ప్రైవేట్ సంస్థల ఎంట్రీ ఇవ్వడం ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పారు. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ ను కలుస్తానని చెప్పినప్పుడు రాజకీయ నాయకులతో తనకు సంబంధం లేదని ఆయన చెప్పారని… ఆ తర్వాత ఆయనను ఒప్పించి అపాయింట్ మెంట్ తీసుకున్నానని, 45 నిమిషాలు మాట్లాడానని తెలిపారు. హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టాలని కోరానని చెప్పారు. ఇప్పుడు అదే మైక్రోసాఫ్ట్ కు తెలుగు వ్యక్తి సత్య నాదెళ్ల సీఈవోగా ఉన్నారని కొనియాడారు. మన దేశానికి ఉన్న గొప్ప వరం జనాభా అని చంద్రబాబు చెప్పారు. చాలా దేశాలు జనాభా తగ్గుదల సమస్యను ఎదుర్కొంటున్నాయని… మన దేశానికి మరో 40 ఏళ్ల వరకు ఆ సమస్య లేదని అన్నారు. అందరం కలిసి కృషి చేస్తే త్వరలోనే భారత్ అగ్రస్థానానికి చేరుకుంటుందని చెప్పారు.