

నేటి భారత్ న్యూస్ – ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. టన్నెల్ పైకప్పు కూలిన ఘటనపై ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్, ఎస్పీ, అగ్నిమాపక శాఖ, హైడ్రా, నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. తెలుసుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా ఘటనాస్థలికి చేరుకున్నారు. మంత్రి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి వెంట నీటిపారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్, అధికారులు ఉన్నారు.ప్రమాద ఘటనపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ లోపల చిక్కుకున్న కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకురావాలన్నారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని స్పష్టం చేశారు.ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదానికి పూర్తి బాధ్యత రేవంత్ రెడ్డిదేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సుంకిశాల ఘటన మరువక ముందే మరో దుర్ఘటన జరగడం ప్రభుత్వ వైఫల్యమే అన్నారు. టన్నెల్లో చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు చేపట్టాలని ఆయన అన్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్‌పై పారదర్శకంగా విచారణ జరిపించాలని అన్నారు.