

నేటి భారత్ న్యూస్- ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంల ద్వారా భారీ ఆదాయం పొందింది. ఎస్‌బీఐ. నగదు ఉపసంహరణ (విత్ డ్రా) ఛార్జీల ద్వారా 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.331 కోట్లు ఆర్జించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ లోక్‌సభకు తెలియజేసింది. ఇదే సమయంలో, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉమ్మడిగా రూ.925 కోట్ల నష్టాన్ని చవిచూశాయని తెలిపింది. గత ఐదేళ్లలో (2019-20 నుండి 2023-24 వరకు) ఎస్‌బీఐ మొత్తం రూ.2,043 కోట్లు సంపాదించింది. కాగా మిగిలిన తొమ్మిది ప్రభుత్వ రంగ బ్యాంకులు కలిసి రూ.3,738.78 కోట్ల నష్టాన్ని మూటగట్టుకున్నాయి. అయితే కెనరా బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ మాత్రం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. ఈ ఐదేళ్లలో ఎస్‌బీఐ నిరంతరంగా లాభాలను ఆర్జించడం విశేషం. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో ఎస్‌బీఐ వాటా 30 శాతంగా ఉంది. మొత్తం 65 వేలకు పైగా ఏటీఎంలను ఎస్‌బీఐ నిర్వహిస్తోంది. వినియోగదారుల నుంచి ఏటీఎం విత్‌డ్రా ఛార్జీల రూపంలో ఎస్‌బీఐ ఆదాయం పొందుతోంది. అంతేకాకుండా, ఇతర బ్యాంకుల నుంచి ఇంటర్ఛేంజ్ ఫీజుల ద్వారా కూడా కొంత మొత్తం వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మార్గదర్శకాల ప్రకారం, బ్యాంకులు మెట్రో నగరాల్లో మూడు, ఇతర నగరాల్లో ఐదు ఉచిత లావాదేవీలను అందించాలి. ఆ పరిమితి దాటితే ఛార్జీలు వసూలు చేస్తాయి.