

నేటి భారత్ న్యూస్- ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జగన్ ఏనాడూ ప్రజల్లో తిరగలేదని, ప్రజల్లోకి వస్తే పరదాలు కట్టుకునేవారని ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని విధ్వంసం చేసిందని ఆరోపించారు. ఐదేళ్ల పాలన తర్వాత పది లక్షల కోట్ల అప్పును మిగిల్చి వెళ్లిందని వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఈమేరకు శనివారం పశ్చిమగోదావరి జిల్లా తణుకులో సీఎం చంద్రబాబు పర్యటించారు. తణుకులో నిర్వహించిన ‘స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న జగన్ ఏనాడైనా ప్రజల్లో తిరిగారా అని చంద్రబాబు ప్రశ్నించారు. కార్లలో వస్తే రోడ్డు పక్కన పరదాలు కట్టించేవారు, విమానంలో రావాలంటే లెక్కలేనన్ని చెట్లను నరికించే వారు, ప్రజల సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా నోరు మెదపనిచ్చే వారే కాదని ఆరోపించారు. ప్రజలు తమ సమస్యలు చెప్పుకునే అవకాశమే ఇవ్వలేదని తీవ్రంగా మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అలా ఎప్పటికీ చేయదన్నారు. ప్రస్తుతం ప్రజల సమస్యలు వినేందుకే ఈ పర్యటన చేపట్టానని చంద్రబాబు తెలిపారు.