

నేటి భారత్ న్యూస్- దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న ఓ బ్రిడ్జి అకస్మాత్తుగా కూలిపోయింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు. మరో నలుగురికి తీవ్ర గాయాలు కాగా మరొకరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం రెస్క్యూ బృందాలు శిథిలాల కింద గాలిస్తున్నారు. బ్రిడ్జి కూలుతున్న దృశ్యాలు అక్కడున్న ఓ కారులోని డ్యాష్ బోర్డు కెమెరాలో రికార్డయ్యాయి. కొరియా స్థానిక మీడియా సంస్థలు ఈ వీడియోను ప్రసారం చేశాయి.దక్షిణ కొరియా నేషనల్ ఫైర్ ఏజెన్సీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. సియోల్ కు 65 కిలోమీటర్ల దూరంలోని అన్ సియాంగ్ అనే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి ఉన్నట్టుండి కుప్పకూలింది. మంగళవారం ఉదయం 9:50 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించినట్లు పేర్కొంది. గల్లంతయిన ముగ్గురు కార్మికుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.