

నేటి భారత్ న్యూస్- ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం దుబాయ్ లో పాకిస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్ చేసి 241 పరుగులు చేసింది. ఓపెనర్ గా వచ్చిన రోహిత్ శర్మ 20 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఔటయ్యాడు. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీతో కలిసి శుభ్ మన్ గిల్ ఆచితూచి ఆడుతూ హాఫ్ సెంచరీకి చేరువయ్యాడు. అయితే, పాక్ స్పిన్ బౌలర్ అబ్రార్ అద్భుతమైన బంతితో గిల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. గిల్ డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేసినా బంతి బ్యాట్ పక్కనుంచి వెళ్లి వికెట్లను గిరాటేసింది.దీంతో హాఫ్ సెంచరీకి మరో నాలుగు పరుగుల దూరంలో వున్న గిల్ పెవిలియన్ బాట పట్టాడు. అయితే, ఈ సందర్భంగా పాక్ బౌలర్ అబ్రార్ భారత బ్యాట్స్ మన్ గిల్ ను చూస్తూ ‘ఇక వెళ్లు.. వెళ్లు’ అన్నట్లు సైగ చేయడం కెమెరాలో రికార్డైంది. చేతులు రెండూ కట్టుకుని తల తిప్పుతూ సైగలు చేయడం, పక్కనే ఉన్న ముహమ్మద్ నవ్వడం వీడియోలో కనిపించింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.