

నేటి భారత్ న్యూస్- దాదాపు మూడు దశాబ్దాల తర్వాత పాకిస్థాన్ ఛాంపియన్స్ ట్రోఫీ రూపంలో ఓ ఐసీసీ ఈవెంట్‌కు ఆతిథ్యమిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నమెంట్‌ను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని దాయాది దేశం భారీ ఏర్పాట్లు చేసింది. ముఖ్యంగా భద్రత విషయంలోనూ ఎక్కడా తగ్గకుండా భారీ మొత్తంలో సిబ్బందిని రంగంలోకి దించింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా భద్రతా విధులు నిర్వహించేందుకు పంజాబ్ ప్రావిన్స్ పోలీసులు నిరాకరించడంతో వారిపై అక్కడి ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. 100 మందికి పైగా పోలీసులను విధుల నుంచి తొలగించింది. వీరు పోలీసు దళంలోని వివిధ విభాగాలకు చెందినవారని పంజాబ్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. వివిధ సందర్భాలలో వారికి కేటాయించిన విధులకు హాజరుకాలేదని గుర్తించిన ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. “లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, ఆటగాళ్లు బస చేసే హోటళ్ల మధ్య ప్రయాణించే జట్లకు భద్రత కల్పించడానికి పోలీసు సిబ్బందిని నియమించారు. కానీ వారు తమ విధులకు గైర్హాజరు కావడం లేదా వారి బాధ్యతలను స్వీకరించడానికి పూర్తిగా నిరాకరించడం జరిగింది” అని పోలీస్ అధికారి పేర్కొన్నారు.ఈ విషయం పంజాబ్ ఐజీపీ ఉస్మాన్ అన్వర్ దృష్టికి వెళ్లడంతో సంబంధిత పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారని ఆ అధికారి తెలిపారు. “అంతర్జాతీయ కార్యక్రమాల భద్రత విషయంలో నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకూడదు” అని ఐజీపీ చెప్పినట్లు ఆయన తెలిపారు.కాగా, తొలగించబడిన పోలీసు సిబ్బంది తమకు కేటాయించిన అధికారిక విధులను నిర్వహించడానికి ఎందుకు నిరాకరించారనే దానిపై అధికారిక సమాచారం లేదు. అయితే, అక్కడి స్థానిక మీడియా సమాచారం ప్రకారం… సుదీర్ఘమైన పని గంటల కారణంగా ఒత్తిడికి గురవుతున్నారని తెలిసింది. అందుకే వారు విధులకు వెళ్లకూడదని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అలాగే న్యూజిలాండ్, భారత్ చేతిలో ఘోర పరాజయాల కారణంగా తమ క్రికెట్ జట్టు ఇప్పటికే ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి నిష్క్రమించిన నేపథ్యమూ వారిని విధులకు హాజరుకాకుండా చేసి ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.ఇదిలాఉంటే.. పాకిస్థాన్‌లో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ఉగ్రవాద ముప్పు ఉందనే వార్తలను ఫెడరల్ సమాచార మంత్రి అత్తౌల్లా తరార్ తోసిపుచ్చారు. ఈ ఐసీసీ టోర్నీని పాక్ ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహిస్తోందని సోమవారం జియో న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మంత్రి చెప్పుకొచ్చారు.