

నేటి భారత్ న్యూస్- ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ఆయనతో పాటు అర్ధాంగి నారా భువనేశ్వరి, కుమారుడు రాష్ట్రమంత్రి నారా లోకేశ్, కోడలు బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్ ఉన్నారు. సీఎం చంద్రబాబుకు ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు, అర్చకులు లాంఛనంగా స్వాగతం పలికారు. తరిగొండ వెంగమాంబ సత్రంలో దేవాన్ష్ పేరుతో అన్నదానం నిర్వహించనున్నారు. చంద్రబాబు కుటుంబం మధ్యాహ్నం తిరుమల నుంచి బయల్దేరి హైదరాబాద్ చేరుకుంటారు. కాగా, స్వామివారి దర్శనం కోసం గురువారం రాత్రి చంద్రబాబు తిరుమల చేరుకున్నారు. పద్మావతి విశ్రాంతి గృహం దగ్గర టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి రామానారాయణ రెడ్డి, టీటీడీ ఈఓ శ్యామలరావు తదితరులు చంద్రబాబు కుటుంబానికి పుష్పగుచ్ఛాలతో స్వాగతం పలికారు. రాత్రి అక్కడే బస చేసిన సీఎం కుటుంబం… శుక్రవారం ఉదయం స్వామివారి సేవలో పాల్గొంది.