

నేటి భారత్ న్యూస్- పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి, జ్యోతి కృష్ణ సంయుక్తంగా తెరకెక్కిస్తోన్న భారీ చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, ఒక సాంగ్ రిలీజ్ చేయగా ఈరోజు రెండో పాటను విడుదల చేశారు. ‘కొల్లగొట్టినాదిరో’ అంటూ సాగే పాటను మేకర్స్ తాజాగా విడుదల చేశారు. కోర కోర మీసాలతో కొదమ కొదమ అడుగులతో… అంటూ వీరమల్లుని పొగుడుతూ సాగింది ఈ పాట. మంచి మాస్ బీట్ తో సాంగ్ అదిరిపోయింది. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి అందించిన బాణీలకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. మంగ్లీ, రాహుల్ సిప్లిగంజ్, రమ్య బెహరా, యామిని ఘంటసాల ఈ పాటను ఆలపించారు. ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఏ.దయాకర్ రావు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో పవన్ సరసన కథానాయికగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. పవన్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్న ఈ సినిమాలో బాబీ డియోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి లాంటి బాలీవుడ్ స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కాగా, ‘హరిహర వీరమల్లు’ చిత్రానికి అత్యధిక భాగం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఇంకా చిత్రీకరణ మిగిలుండగానే క్రిష్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో ఆయన స్థానంలో ఈ చిత్ర నిర్మాత ఏఎం రత్నం తనయుడు జ్యోతికృష్ణ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ‘హరిహర వీరమల్లు’ చిత్రం మార్చి 28న వరల్డ్ వైడ్ గా థియేటర్లలో సందడి చేయనుంది.